ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకిష్టం..?

దేవుళ్లల్లో ధైర్యానికి ప్రతిరూపంగా ఆంజనేయ స్వామిని చెప్పుకుంటారు. దుష్ట శక్తులు ఆంజనేయ స్వామిని చూడగానే భయపడిపోతాయని కొందరు అంటుంటారు. అందుకే ప్రతీ మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పీడిత వ్యక్తుల నుంచి తమను కాపాడాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సింధూరం తిలకాన్ని ధరిస్తారు. అయితే చాలా మంది భక్తి పారవశ్యంలో మునిగిపోయి సింధూరం తిలకాన్ని ధరిస్తారు. కానీ సింధూరాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి..? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఈ సింధూరం తిలకం వెనుక ఓ పురాణ గాథ ఉంది. అదేంటో తెలుసుకుందాం.

రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. రాముడికి వీరభక్తుడు ఆంజనేయుడు. రాముడికి మంచి జరుగుతుందంటే కొండలను కూడా పిండి చేసేంత ధైర్యశాలి. ఈ క్రమంలో ఒకసారి సీత సింధూరాన్ని నుదుట పెట్టుకుంటుంది. ఇది చూసిన ఆంజనేయుడు సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నావని అడుగుతాడు. వాస్తవానికి కారణం లేకపోయినా రామునికి మంచి జరుగుతుందని చెబుతుంది. దీంతో రాముడికి మంచి జరుగుతుందనే కారణంతో ఆంజనేయుడు కూడా సింధూరాన్ని ధరిస్తాడు.

ఒకసారి సభలోకి ఆంజనేయుడు తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకొని ప్రవేశిస్తాడు. ఇది చూసిన రాముడు కారణం అడుగుతాడు. దీంతో సీత చెప్పిన విషయాన్ని ఆంజనేయుడు చెబుతాడు. దీంతో ఆంజనేయుడి సమాధానం విని రాముడు పరవశించిపోతాడు. వెంటనే ఆంజనేయుడికి ఓ వరం ఇస్తాడు. ప్రతీ మంగళవారం సింధూరాన్ని ఎవరు ధరిస్తారో.. వారికి ఆంజనేయుడు ప్రసన్నం అవుతాడని చెబుతాడు. అప్పటి నుంచి భక్తులు మంగళవారం ఆంజనేయుడి ఆలయంలో సింధూరాన్ని ధరిస్తారు.

చాలా దేవాలయాల్లో కుంకుమ, విబూది ఉంటుంది. కానీ ఆంజనేయుడి ఆలయంలో మాత్రమే సింధూరం కనిపిస్తుంది. ఆంజనేయుడి సింధూరాన్ని నుదుటిపైనే కాకుండా మెడపై కూడా ధరిస్తారు. తమ శరీరాన్ని ఆవహించిన ఎలాంటి దుష్ట శక్తులైనా సింధూరం భయానికి వదిలిపోతాయని నమ్ముతారు. ఇది ఆంజనేయుడి సింధూరం స్టోరీ.

Leave a Comment