ఇప్పటం బాధితులకు పవన్ లక్ష చొప్పున సాయం..

జనసేన అధినేత పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.. ఇప్పటం బాధితులకు లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గత శనివారం ఆయన గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామస్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వారికి ఆర్థిక సాయం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అక్రమంగా పేదల ఇళ్లు కూల్చిందని ఆరోపిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ గ్రామానికి చేరిన పవన్ బాధితుల గోడును ఓపిగ్గా విన్నారు. ప్రతి ఒక్కరిని ఓదారుస్తూ వారికి అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం ఇక్కడ మరో ఇల్లు కూల్చకుండా తన ప్రాణం అడ్డు వేస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తక్షణ సాయంగా ఒక్కో బాధితుడికి రూ. లక్ష సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధికారికంగా వెల్లడించారు.

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రోడ్ల విస్తరణలో భాగంగా గత శుక్రవారం కొన్ని ఇళ్ల నిర్మాణాలను తొలగించింది. 24 గంటలు గడవకముందేగ్రామంలో బాధితులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ ఇప్పటం గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన రాకను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని రోప్ పోలీసులు పవన్ ను నిలువరించారు. దీంతో వాహనాలను అక్కడే ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. పవన్ తో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీగా నడుచుకుంటూ రావడంతో రహదారిపై విపరీత ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొననుండడంతో పోలీసులు పవన్ వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ తన కారుపై నిలబడి గ్రామాన్ని చేరుకున్నారు.ఆ తరువాత బాధితుల గోడును విన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలకు పాల్పడ్డా బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క బాధితుడిని అక్కున చేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం స్పందించకపోతే తాను ఆదుకుంటానని అన్నారు. ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేర్చాడు.

మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతీ బాధితుడికి లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారన్న కక్షతో ఆ గ్రామ ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తనకు సహకరించిన ఇప్పటం గ్రామస్థులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటానని మాట ఇచ్చిన పవన్ అనుకున్న విధంగానే వారికి పరిహారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Comment