మొగ నెమలి కన్నీరుతో ఆడ నెమలి గర్భం దాల్చుతుందా..?నిజమేనా..?

మన భారతదేశంలో నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. జాతీయ పక్షిగా ఉన్న ఈ నెమలిని అపూరూరంగా చూసుకుంటారు. అంతేకాకుండా చూడ్డానికి అందంగా కూడా ఉండడంతో నెమలిని చూస్తూ మనసు హాయిగా ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక ప్రకారం చూసిన నెమలికి ప్రాధాన్యం ఎక్కువే. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛాన్ని ఉంచుతాడు. అయితే ఇంతటి మహోన్నత స్థానం కలిగిన నెమలి గురించి కొన్ని వాదనలు విచిత్రంగా ఉన్నాయి. ఆడనెమలి గర్భం దాల్చాడానికి మొగ నెమలితో శృంగారంలో పాల్గొనదట. కేవలం మొగ నెమలి కన్నీటి బిందువులను తాగి పునరుత్పత్తి చెందుతుందని అంటారు. అస్కలిత బ్రహ్మచారి అయినందువల్లే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని తలపై ధరిస్తారని అంటారు.

అయితే ఇది అపోహేనని సైన్స్ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. భూమ్మీద పుట్టిన ప్రతీ జీవి లైంగికంగా పాల్గొనకుండా పునరుత్పత్తి జరిగే అవకాశం లేదని అంటున్నారు. పురుష భీజ కణాలు, స్త్రీ భీజ కణాలు కలిసినప్పుడే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష భీజ కణాలు, స్త్రీ భీజ కణాలు కలయికతో తప్ప మరెవంటి మార్గం లేదంటున్నారు. పురుష భీజ కణాలు నోటి ద్వారా తీసుకొని గర్భం దాల్చిన జీవి ఎక్కడా కనుగొనలేదు.

నెమలిలోనూ ఇదే జరుగుతుంది. అయితే ఆడ, మొగ నెమలి కలయికకు ఓ సందర్భం ఉంటుంది. మొగ నెమిలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఇలా చేసి ఆడ నెమలిని ఆకర్షిస్తుంది. అంటే శృంగారానికి ఆడనెమలిని ఆహ్వానించడానికి ఒక రకమైన శబ్దం చేస్తుంది. మొగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. ఆడనెమలికి పొడవాటి ఈకలు ఉండవు. ఆడనెమలికి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగు ఈకలు ఉంటాయి. అలాగే తలపై కుచ్చులాంటి ఆకారం ఉంటుంది.

ఇక స్కూలుకెళ్లే విద్యార్థులు తమ పుస్తకాల్లో నెమలి ఈకలను ఉంచుతారు. అయితే ఇలా పెట్టడం వల్ల మరో నెమలిక తయారవుతుందని అంటారు. కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రకృతి ధర్మంగానే ఏదైనా నడుచుకుంటుంది. మధ్యలో వచ్చిన విషయాలన్నీ కల్పితమేనని తెలుసుకోవాలి. అలాగే నెమలి కూడా సంభోగంలో పాల్గొన్న తరువాత పిల్లల్ని కంటుంది.

Leave a Comment